Monday, September 10, 2018

కేరాఫ్ కంచరపాలెం

కాలాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ప్రతి ముక్కలో తనని తాను వెతుక్కోమంటే సింహభాగం ప్రతి మనిషి ఙ్ఞాపకాలలో ప్రేమే కనిపిస్తుంది.  
బాల్యం, కౌమారం యవ్వనం యే దశైతే ఏంది? తనని తాను కాలపు అద్దం ముందు నిల్చోబెట్టి చూసుకోమంటే తన ప్రతిఙ్ఞాపకంలో తడి తడిగా తగిలేది ప్రేమే.
జీవితపు ప్రతిమలుపులో గులాభి పువ్వుతోనో, ఆర్చీస్ గ్రీటింగ్ కార్డు పట్టుకునో వీలైతే రంగు రంగుల కాగితాలపై సెంటుపెన్నుతో రాసిన ప్రేమలేఖల కాలంలో నాస్టాల్జిక్ గా ఫీలవుతూ మునిగిపోయి తప్పిపోయిన సున్నితమైన వ్యక్తులమే మనం అందరం. లేదూ మామిడితోటల్లోనో సైకిల్ తొక్కుతూ స్కూలకెళ్తూనో టిఫిన్ బాక్సులు మార్చుకుంటూనో గంటల తరబడి బస్టాపుల్లో టైం కాల్చుకునో ప్రతి సినిమా రిలీజైనపుడు అభిమాన హీరోని ఫాలో అయిపోయి జీవితపు కొన్ని కాగితాలనిండా ఙ్ఞాపకాల రంగుని ఇష్టం వచ్చినట్టు నింపుకున్న వాళ్లమే. కేరాఫ్ కంచరపాలెం అలాంటి ఙ్ఞాపకాల కేరాఫ్.
****
కేరాఫ్ కంచరపాలెం సినిమా ఒక ప్రేక్షకురాలిగా చాలా ఆశ్చర్యపోయి చూసిన సినిమా. అది కథపరంగానా? స్ర్కీన్ ప్లే పరంగానా? ఎడిటింగ్ పరంగానా? ఏమో చెప్పలేను. కానీ నచ్చింది. చూడబోయే మీకు కూడా నచ్చుతుంది
అరే ఇది నా కథే. ఇది మా ఇంట్లోని కథే. మా వీదిలో కథే అనుకునేలాంటి కథ. కాదు కథల సమాహారం. తమిళ మళయాల సినిమాలు చూసినప్పుడు మన తెలుగు సినిమాలు నేటివిటీకి ఇంత దగ్గరగా తీసిన సినిమాలు లేవే అనే బాధ కలిగేది. అయితే రాబోతున్న తెలుగు సినిమాల వైవిధ్యభరిత కధనాలకి ముందు వరుసలో నడిచే సినిమాల్లో కేరాఫ్ కంచరపాలెం ఒకటని చెప్పొచ్చు. నీదీ నాదీ ఒకే కథ సినిమా స్టీరియోని బ్రేక్ చేస్తూ ముందుకు వస్తే కేరాఫ్ కంచరపాలెం సామాన్య బడుగుజీవితాల లోతుల్ని , భావోద్వేగాలని, ప్రేమల్ని, వ్యధల్ని తాపత్రయాల్ని చద్దిమూటలా మార్చి తెచ్చింది.
కేరాఫ్ కంచరపాలెం ఒక సినిమా లాగా కన్నా, కొన్ని జీవితాలు ముడివేసుకున్న యదార్ధ ప్రాపంచిక సత్యాల కూర్పులా అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో తెలుగులో ఇంత వాస్తవానికి దగ్గరగా వచ్చిన సినిమా ఇదేనేమో. సినిమా చూస్తున్నంత సేపు ప్రతి పాత్ర మనల్ని తమవెంట లాక్కెళ్తాయ్.
గొప్ప కథనం. స్క్రీన్ ప్లే. తనకిచ్చిన స్పేస్ ని ఒక కాన్వాస్ గా వాడుకున్న దర్శకుడు దృశ్యకావ్యాన్ని ఆవిష్కరించాడు. ఎడిటింగ్ పర్పెక్ట్. సినిమాని సినిమాగా కన్న నిజమైన పాత్రలుగా ఫీలైన ప్రేక్షకుల గోలలో సినిమా విజయం, దర్శకుడి విజయం చూడొచ్చు.
****
సినిమా దగ్గరకొస్తే :
రాజు అనే వ్యక్తికి 49 యేళ్లు వచ్చినా పెళ్లి కాదు. ఊర్లో అందరు అతన్ని నట్టుగాడని పిలుస్తుంటారు. అతడు పనిచేసే ఆఫీస్ లోకి కొత్తగా ఒక ఆఫీసరమ్మ వస్తుంది. ఆమెకి 42 యేళ్లు. భర్త చనిపోయి పదిహేనేళ్లు. ఇరవై యేళ్ల కూతురు. ఈ ఇద్దరి ముదురు ప్రేమ కథకి అటాచ్డ్ గా ఒక్కో పొరగా ఒక్కో కథని పార్లెల్ గా చూపిస్తూ వెళ్తాడు దర్శకుడు.
ఇంతకి మన నట్టుగాడకి పెళ్లయ్యిందా లేదా ? ఆమె ప్రేమిస్తున్నా అని అనగానే భయపడ్డ నట్టుగాడు అనిపిలవబడే రాజు ఎలా ఒప్ఫుకున్నాడు? పెళ్లి చేసుకోని రాజుని ఊరు నుంచి వెలివేస్తామన్న ఊరోళ్లు చివరకి ఎలా హత్తుకున్నారు అన్నది సినిమాలో చూడాల్సిందే.
సుందరం పాత్ర, జోసెఫ్ పాత్ర గెడ్డం అబ్బాయ్ పాత్ర రాజు పాత్ర దేనికదే ప్రత్యేకం. ఒక పాత్రని ఇంకో పాత్రతో కలపకుండా సినిమా తరువాత సీన్ ఏం జరగబోతుందో చెప్పకుండా ముఖ్యంగా ప్రేక్షకుడు గెస్ చేయడానికి కూడా వీళ్లేనంత పగడ్బంధి స్క్రీన్ ప్లే ఇంకా ఎడిటింగ్ ఉంది.
కథ చివర్లో భారంగా బాధతో కృంగిపోతున్న ప్రేక్షకుడిని తేలికగా ఫీలైయ్యేట్టు చేసి ప్రశాంతంగా రాజు భుజాన చేయేసి ఇంటకొచ్చేట్టు చేస్తుంది దర్శకుడి కథ చెప్పిన తీరు.
*****
స్మృతుల ప్రధానంగా అందులో బాల్య స్మృతుల ప్రధానంగా వచ్చిన కధలు ఎక్కువ వరకీ హిట్ అవుతాయ్.
ఆటో గ్రాఫ్ నా స్విట్ మెమరీస్ అనే సినిమా తీసుకున్న, ప్రేమమ్ సినిమా అయినా ఎటో వెళ్లిపోయింది మనసు లాంటి సినిమాలు గతంలోకి ప్రస్తుతంలోకి వెనకా ముందుకు ప్రయాణం చేస్తూ కథ చెప్పి ప్రేక్షకున్ని సమ్మోహితుల్ని చేసినవే అయితే కేరాఫ్ కంచరపాలెం ఎందుకు ప్రత్యేకంగా ఉంటుందంటే రాజు పాత్ర స్మృతులు దేనికవే ప్రత్యేకం. క్లైమాక్స్ కొచ్చేవరకు ఒక వ్యక్తిలోనే కథని ప్రతిష్టించే గోప్యతతో కథని చాలా డీటేయిల్డ్ గా construct చేసాడు దర్శకుడు.
• తొమ్మిది పదేళ్ల వయసులో పుట్టే పసిప్రేమ స్కూలు వయసు లేతదనం చూస్తున్న ప్రేక్షకున్ని గిలిగింతలు పెడుతుంది.ఆ అమ్మాయ్ సుందరం అనే కుర్రోన్ని అబ్బాయ్ అని పిలిచినపుడల్లా మనల్నెవరో పిలిచినట్టే ఉంటుంది.
• జోసెఫ్ లాంటి కుర్రోన్ని ఆ బ్రాహ్మణుల అమ్మాయ్ ప్రేమించేసి తండ్రిని ఎదిరించినప్పటికీ జోసెఫ్ మతం తనకి ఎంత పెద్ద అడ్డంకి అయ్యిందో అదో బాధ.
• గడ్డమ్మబ్బాయ్ సలీమా నాకు భలే నచ్చారు. రోజూ మందుబాటిల్ తీసుకెళ్లే అమ్మాయ్ వేశ్యా వృత్తిలో ఉన్న ఆ అమ్మాయ్ని కల్మషం లేకుండా ప్రేమించిన గడ్డం అబ్బాయ్ పెళ్లి అనే కల పెద్ద విషాదంతో చెదిరిపోయి కన్నీళ్లు పెట్టిస్తుంది.
• లేటు వయసు రాజు గారి ప్రేమ.
• వినాయక చవితికి విగ్రహం చేస్తానని వ్యాపారంలోకి దిగి విగ్రహాన్ని చేసి కూడా అనివార్య అసంకల్పిత కారణాల వల్ల సర్వం కోల్పోయిన నత్తి వాడైన చేతి వృత్తి కళాకారుడి దుఖం.
• అమ్మోరు బాబాయ్ ప్రేమ.
• తల్లి ప్రేమని గెలిపించటానికి కూతురి ఆరాటం.
ఇలా అన్ని పాత్రలు తమని తాము చాలా సహజంగా ఆవిష్కరించుకోవటం ఒకవైపైతే, ప్రతి పాత్ర చాలా సహజంగా నటించేయటం గొప్ప యాడెడ్ అడ్వాంటేజ్.
ఒక ప్రాంతపు అస్థిత్వం ఆ ప్రాంతపు భాషమీద ఎక్కువగా ఆదారపడి ఉండటం అయితే ఈ సినిమాలో ఆ భాషా సౌందర్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది.
*****
ఈ సినిమా ఏం మాట్లాడుతుంది??
○. మనిషి తనలోంచి తాను తవ్వుకుంటున్న కొద్ది తనకై తానే ఎన్ని కథలుగానో ఙ్ఞాపకాలుగా బతకగలగటం.
○. దేవుడిదేముంది తనచుట్టున్న మనుషులు పిలవగానే సహాయపడుతున్నప్పుడు ఇంక దేవుడ్ని ఎందుకు పూజించాల్సి రావటం. మనిషిలో దైవత్వాన్ని చూడటం.
○. ప్రేమకి కులంతో మతంతో ఎదురైయ్యే సమస్యలు.
○. మనిషి మతాన్ని ప్రేమిస్తూ సాటి మనిషిని ప్రేమించలేకపోవటం.
○. స్త్రీల విషయంలో ప్రతి దశలో తన జీవితానికి సంబంధించిన నిర్ణయం నాన్న తమ్ముడు లాంటి వాళ్లే అధికారికంగా నిర్ణయించేయటం. పితృస్వామ్య వ్యవస్థ తీరు కళ్లకు కట్టినట్టు చూపించగలగటం.
○. మరో మతం పట్ల మనిషికి లేని సంయమనం.
○. వయసు మారుతున్న ఆడవాళ్ల స్థితిగతుల్ని వాళ్లు అర్ధం చేసుకోగలగటం.
○. కులం మతం మనిషిని ఎలా ట్రీట్ చేస్తాయ్ పనిచేసే దగ్గర. పని చేసేచోట స్త్రీలు ఎలా ట్రీట్ చేయబడతారు?
○. దేవున్ని తన చేతులతో చేసిన మనిషి తిరిగి దేవుడి వల్ల పరాజితుడై ఆత్మ హత్య చేసుకోవటం.
*****
మొత్తంగా సినిమా చూసి బయటికొచ్చే ప్రేక్షకుడు ప్రశాంతంగా గుండెలనిండా గాలి పీల్చుకుని నవ్వు మొహంతో బయటికొస్తాడు.
కథలు లేవని బాధపడిపోతున్న తెలుగు సినిమా పరిశ్రమకి మనుషుల చుట్టుపక్కన ఉండే జీవితాలే ఎంత గొప్ప కథలు కాగలవో నిరూపించాడు దర్శకుడు.
హాయిగా వెళ్లి చూసేయండి.ఇలాంటి సినిమాలు దర్శకులు ఇలాంటి సహజ నటులు ఎపుడోగానీ మనకి కనబడరు. కోట్లు కోట్లు పోసి పెద్ద నటుల్ని పెట్టి పరిశ్రమంటే భారీ బడ్జెట్ సినిమాలు కాదు సినిమాలంటే ఇవి అని చెప్పేందుకైనా.
.......
మెర్సీ మార్గరెట్
07.09.18